మహేష్‌కి సంతృప్తినిచ్చింది ఇది ఒక్కటేనా?

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 20 ఏళ్ల కెరీర్‌ని పురస్కరించుకుంటూ ఆయన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వచ్చిన చిత్రం ‘మహర్షి’. దీనిపై ఎన్నడూ తన సొంత సినిమాల విషయంలో కూడా చూపని ఆసక్తిని మహేష్‌ చూపించాడు. ఆయన ఈ మూవీ విషయంలో ఎంతగా ఎమోషనల్‌ అయిపోయాడంటే.. ఈ చిత్రం చూసి అభిమానులే కాదు... నేను కూడా కాలర్‌ ఎగరేస్తున్నానని చెప్పి, ఒకసారి కాదు... రెండు సార్లు కాలర్‌ ఎత్తాడు. ఇక ఈ చిత్రం గురించి దిల్‌రాజు చూపిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఇది మహేష్‌ కెరీర్‌లోనే కాదు.. తెలుగు ఇండస్ట్రీలోని ఓ ఎపిక్‌ చిత్రం అంటూ మాట్లాడాడు. మహేష్‌ అయితే దర్శకుడు వంశీపైడిపల్లిని తన ఆప్యాయత, కృతజ్ఞత చూపుతూ ఆయనకు ముద్దు కూడా పెట్టేశాడు. అంతేకాదు.. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ డెహ్రాడూన్‌లో జరిగే సందర్భంలో ఈ మూవీ ‘పోకిరి’ స్కేర్‌ అవుతుందని చెప్పానని, తన కెరీర్‌లో ‘పోకిరి, ఒక్కడు, శ్రీమంతుడు, భరత్‌ అనే నేను’లని మించిన విజయం ఇదేనని ఢంకా భజాయించాడు. 

కానీ అదే మహేష్‌బాబు విజయవాడ సభకి వచ్చేసరికి ముచ్చటగా మూడోసారి కాలర్‌ ఎగురవేస్తాడని పలువురు భావించారు. కానీ అప్పటికే లోగుట్టు తెలిసిందేమో మహేష్‌ మౌనం పాటించాడు. ఈచిత్రం నిజమైన ఎపిక్‌ మూవీ అయితే బాహుబలిని కాకపోయినా కనీసం నాన్‌బాహుబలి రికార్డులనైనా బద్దలు కొట్టాలి. కానీ అది కూడా లేదు. కనీసం మహేష్‌ కెరీర్‌ బెస్ట్‌ అయిన ‘భరత్‌ అనే నేను’ను దాటుతుందనే ఆశలు కూడా కనిపించడంలేదు. ఇక మహేష్‌ విదేశాలకు వెకేషన్‌ కోసం తుర్రుమన్నాడు. ఆ తర్వాత ప్రమోషన్స్‌ చడీచప్పుడు కనిపించడం లేదు. బహుశా యూనిట్‌ అంతా దాదాపు శుక్రవారంతో ముగిసే ఫైనల్‌రన్‌ ఫలితాల గోలలో ఉండి ఉంటారు. నిజానికి నాన్‌ బాహుబలి రికార్డు ప్రస్తుతం రంగస్థలం మీద ఉంది. చిట్టిబాబు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని ఏరియాలలో రికార్డులను బద్దలు కొట్టి అందరికీ లాభాలు పంచాడు. 

కానీ ‘మహర్షి’ మాత్రం నైజాం, వైజాగ్‌లలో మాత్రమే కాస్త ఊపులో ఉంది. నైజాంలో మాత్రం ఈ మూవీ ‘రంగస్థలం’ని మించిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇరువురు అభిమానుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక ‘మహానటి, గీతగోవిందం’ వంటి మీడియం రేంజ్‌ చిత్రాలు సైతం ఓవర్‌సీస్‌లో రెండు మిలియన్ల మార్క్‌ని దాటాయి. కానీ దీనికి చాలా దగ్గరగా ‘మహర్షి’ ఆగిపోవడంతో అక్కడ రెండు మిలియన్‌ మార్క్‌ అసాధ్యమేనంటున్నారు. ఇక ‘రంగస్థలం’ చిత్రం సమయంలో జీఎస్టీ ఎక్కువగా ఉంది. టిక్కెట్ల రేట్ల ధరలు మామూలుగానే ఉన్నాయి. కానీ ఈరెండు విషయాలలో మహర్షి లాభపడింది. అయినా 100కోట్ల షేర్‌ వసూలు చేయడం అనుమానంగానే ఉంది. మరి ఈ విషయంలో మహేష్‌ అభిమానులు, యూనిట్‌ ఏమేమి వంకలు చెబుతారో వేచిచూడాల్సివుంది...! 



from Telugu Unicode News feed from Cinejosh.com http://bit.ly/30UQPph

Comments